ఒక్కడే 8 కిలోమీటర్ల రోడ్ ఎలా నిర్మించాడు?

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఒడిస్సా రాష్ట్రంలోని కాంధమాల్ జిల్లా మహిళా కలెక్టర్ ఒక రోజు పేపర్లో ఓ వార్త చూసి ఎందుకు ఆవేదన చెందింది..? ఏమిటీ ఆ వింత కథ..? ఆమె పేరు…. డాక్టర్ బృంద ఐఏఎస్ ఆఫీసర్… కాస్తో కూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అసలే ఒడిశా రాష్ట్రం… అంతులేని పేదరికం, జాడ తెలియని అభివృద్ధి… అనేక గ్రామాలకు రోడ్లు ఉండవు. చదువు అసలే ఉండదు,
వైద్యం అందదు… ఆమె ఓ రోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది. అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా ఆవేదన చెందింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని బాధపడింది… డ్రైవర్‌ను పిలిచింది. గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకు వెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…
ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని వాకబు చేసింది…. ఆయన ఓ మట్టి మనిషి… వయసు 45 సంవత్సరాలు… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా లేదు…
ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు జలంధర్… తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా ఎన్నో అవస్థలు! ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదు… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు జలంధర్… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…? ఓ పలుగూ, పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…రాళ్లూ.. రప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటూ పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కరూ కూడా సహకరించలేదు… అయితేనేం..? ఆ పలుగు ఆగలేదు, ఆ పార అలిసి పోలేదు… రెండేళ్లపాటు కష్టపడ్డాడు…
నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన రోడ్… అని ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది…
ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా ఆవేదన చెందింది. అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…
ఒక మనిషి.. శ్రమను.. లక్ష్యాన్ని.. నిబద్ధతను.. సంకల్పాన్ని చూసింది… కలెక్టర్ ఆయనను అభినందించి..
మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ వేశారు… మంచినీటి సరఫరా కొరకు పైప్ లైన్స్ వేశారు… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె నిర్ణయం తీసుకుంది… వావ్… ఇదీ కదా రియల్ సక్సెస్ స్టోరీ… ఇదీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయ గాథ…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *