
ఇంద్రధనుస్సు ప్రతినిధి: దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 500 సంవత్సరాల అనంతరం శ్రీరాముడు నడయాడిన తన జన్మభూమిలో 22 జనవరి 2024 సోమవారం మధ్యాహ్నం 12.29 నిమిషాలకు ప్రాణప్రతిష్ట గావించుకుని కొలువయ్యాడు. భక్తుల కోర్కెలు తీర్చడానికి అయోధ్యాపురిలో సాకేత రాముడు 5 సంవత్సరాల వయస్సు గల బాల రాముడుగా అవతరించాడు. భారత ప్రధానమంత్రి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ జన్మభూమి కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు. వారి త్యాగాలు వృధా కాలేదు. భారత న్యాయ వ్యవస్థ ద్వారా ధర్మబద్ధంగా పోరాడి విజయం సాధించి రామాలయం నిర్మాణం గావించారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 7000 మంది ఆహ్వానితుల సమక్షంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకున్నారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను తలపై వేసుకొని, సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళి జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను జరుపుకున్నట్లు ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని టీవీ ఛానెల్స్ ద్వారా వీక్షించి ప్రజలు ధన్యులయ్యారు. దేశవ్యాప్తంగా రామాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించి ఆనందభరితులయ్యారు.